CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 10:24 pm Posted By: coalbelt 24 News

రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి

జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అని ఆమె పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన **‘హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభ’**లో కవిత పాల్గొని ప్రసంగించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాదిరిగానే తెలంగాణలోనూ ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయడానికి అంగీకరించకపోతే, రాష్ట్రంలో జనగణన నిర్వహణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జనగణనలో ఓబీసీల వివరాల నమోదుకు ప్రత్యేక కాలమ్‌తో పాటు డ్రాప్‌డౌన్ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఓబీసీల జనాభా ఎంత ఉందో కచ్చితమైన లెక్కలు తేల్చడం సామాజిక న్యాయానికి ఎంతో అవసరమని కవిత అన్నారు. జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, దేశంలో ఓబీసీల జనాభా ఎంత ఉందో లెక్కలు తేల్చకపోవడం సరికాదని విమర్శించారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్‌లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓబీసీ సంఘాలు నిర్వహించనున్న ధర్నాలో తాము పాల్గొంటామని ప్రకటించారు. మహిళా బిల్లు కోసం గతంలో ఢిల్లీలో పోరాడి విజయం సాధించినట్లుగానే, ఓబీసీల హక్కుల సాధన కోసం కూడా అదే స్ఫూర్తితో ఉద్యమిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. ఈ సభలో దేశవ్యాప్తంగా ఓబీసీల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు యెజ్జురప్ప, ధర్మేంద్ర కుశ్వాహ, ఉమేశ్ కొర్రం సకల, గీతిక, సునీల్ వర్మ, రైజా బీబీ, బన్సీ లాల్, నీలం కుమారి, విశ్వజిత్ రతోనియా తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});