యాసంగిలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి
మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సాగు భూముల సంరక్షణకు రైతులు సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి సూచించారు. బుధవారం అందుగులపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఖేత్ బచావో అభియాన్ – సాగు భూమి సంరక్షణ” కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సహజ ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. నీరు, ఇతర సహజ వనరులను పొదుపుగా వినియోగిస్తూ సుస్థిర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.
నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగు ద్వారా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని ఆమె కోరారు. వరి కోత అనంతరం ఖాళీగా ఉండే భూములను సమర్థంగా వినియోగించుకోవాలని, పంట అవశేషాలను సుస్థిర పద్ధతుల్లో నిర్వహించాలని తెలిపారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల నేల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉన్నందున వాటి దహనాన్ని నివారించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. కనకరాజు, సర్పంచ్ ముత్యం రమ, పంచాయతీ కార్యదర్శి వీరేందర్, రైతులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});