కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసులను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేసి, బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పోరాటం చేశారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నించిన వారిని నిర్బంధించడం ద్వారా ఉద్యమకారుల పోరాటాన్ని అణచివేయాలని చూడటం సరికాదన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు
- తెలంగాణ ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలి.
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు పెన్షన్లు మంజూరు చేయాలి.
- ప్రతి ఉద్యమకారుడికి ఇల్లు మంజూరు చేయాలి.
- రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ పాసులు జారీ చేయాలి.
- ప్రతి ఉద్యమకారుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
- ఉద్యమకారుల కుటుంబాలకు రూ.20 లక్షల వరకు వర్తించే ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలి.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన ఉద్యమకారులు
బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు ఎలిగేటి శ్రీనివాస్, పసులేటి వెంకటేష్, ఎరుకల సుందర్రావు, పరిష రవిశ్వర్, విజ్జగిరి రాజేందర్, చిట్యాల మధు, శంకర్ సింగ్ ఉన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});