రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
వ్యవసాయాన్ని రక్షించి, భూసారాన్ని మెరుగుపరుస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా శుక్రవారం మందమర్రి మండలంలోని ఆదిల్‌పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భాను ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ, ‘వ్యవసాయాన్ని రక్షిద్దాం’ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సహజ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నీటితో పాటు ఇతర సహజ వనరులను సంరక్షించడం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను సమతుల్యంగా వినియోగించడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
పంటల వైవిధ్యీకరణలో భాగంగా నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. వరి కోత అనంతరం ఖాళీగా ఉండే భూములను సమర్థంగా వినియోగించుకోవాలని, పంట అవశేషాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. సేంద్రియ, జీవ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ, క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం
‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ (ప్రతి నీటి బిందువుతో మరింత పంట) కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని, భూగర్భ జలాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు. భూసార కార్డుల వినియోగం, ఎరువుల విక్రయాలకు సంబంధించిన నిబంధనలపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. రాజశేఖర్, ఎస్. కనకరాజు, సర్పంచ్ నెండుగురి పున్నం, కృషి సఖిలు వసంత, లిఖితతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});