ముఠా రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలి
CPI(AM) జిల్లా నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంచిర్యాల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్యం కోసం గ్రూపులు, ముఠాలుగా ఏర్పడి రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని CPI(AM) మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. అధికారాన్ని, పదవులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను కబ్జా చేస్తూ, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచిర్యాల నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, అక్రమ సంపాదన కోసం గ్రూపులు, ముఠాలుగా ఏర్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై తగిన దృష్టి సారించడం లేదని విమర్శించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ముఠా రాజకీయాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది రౌడీ, గూండా, ముఠా రాజకీయాలు చేయడానికి కాదని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని నాయకులు కల్పించవద్దని సూచించారు.
పోలీసు శాఖ అధికారులు ముఠా నాయకులకు రక్షణ కల్పిస్తున్నారనే విమర్శలకు తావివ్వకుండా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో CPI(AM) మంచిర్యాల జిల్లా కన్వీనర్ సంకె రవితో పాటు జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, గట్టు మహేందర్, బోండ్ల సరిత, రాతిపెల్లి నగేష్, బోయిరే రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});