CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 8:45 pm Posted By: coalbelt 24 News

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం
మందమర్రి సీఐ రమేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

దేశ రక్షణలో, ప్రజల ప్రాణ, ఆస్తుల పరిరక్షణలో, శాంతిభద్రతల స్థాపనలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మందమర్రి పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెరిమోనియల్ గార్డ్ ఆధ్వర్యంలో గౌరవ వందనం, స్మృతి పరేడ్ నిర్వహించి అమర పోలీస్ వీరుల సేవలను స్మరించుకున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తులను రక్షించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బాధ్యతల నిర్వహణలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత వంటి సందర్భాల్లో పోలీసులు అంకితభావంతో సేవలందిస్తున్నారని అన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, అంకితభావం ప్రతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని సీఐ రమేష్ కొనియాడారు. ప్రజల రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించే పోలీసుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ నరేష్, కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు, దేవాపూర్ ఎస్ఐ గంగారాం, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్‌తో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});