CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 10:55 pm Posted By: coalbelt 24 News

రైతుల పంటలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రాణహిత నీటిని ఎత్తిపోసి పంటలను రక్షించాలి
మొగ్దుంపురంలో ఎండిపోయిన పంటల పరిశీలన
రైతులకు అండగా ఉంటామని భరోసా
టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడి పంటలు ఎండిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోయి ఆందోళనలో ఉన్న రైతులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులను పంటలు వేయవద్దని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులను వ్యవసాయం చేయవద్దని చెప్పలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా మాట్లాడటం సరికాదన్నారు. రైతులను వ్యవసాయం ఆపాలని కోరుతున్న ముఖ్యమంత్రి, తన రాజకీయాలను ఆపుతారా అని ప్రశ్నించారు.

ప్రాణహిత నీటితో పంటలను కాపాడవచ్చు…..

ప్రాణహిత నది వద్ద నీటిని ఎత్తిపోసే చర్యలు చేపడితే రైతుల పంటలను కాపాడవచ్చని కవిత పేర్కొన్నారు. ప్రాణహిత వద్ద చిన్న కాఫర్ డ్యామ్ నిర్మించడం ద్వారా సుమారు 35 నుంచి 40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి బేషజాలకు పోకుండా వెంటనే అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైందా, విఫలమైందా అన్న రాజకీయ చర్చలను పక్కనపెట్టి, ప్రస్తుతం రైతులను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

పంట నష్టంపై అధికారులు అంచనా వేయాలి…..

కరీంనగర్‌కు సమీపంలోని మొగ్దుంపురం గ్రామంలో పంటలు ఎండిపోతున్నా పరిశీలించేందుకు ఏ అధికారి రాకపోవడం బాధాకరమని కవిత అన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరుతామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. కేంద్రాన్ని సాయం కోరాలంటే ముందుగా పంట నష్టం ఎంత జరిగిందో లెక్కలు సిద్ధం చేయాలని అన్నారు.

రాజకీయాల కోసం నీటిని ఎత్తిపోసే చర్యలను చేపట్టకుండా రైతులకు నష్టం కలిగించడం తగదని విమర్శించారు. రాబోయే రోజుల్లోనూ వర్షాలు పడకపోవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకునే చర్యలు తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});