CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 11:53 am Posted By: coalbelt 24 News

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు వామపక్షాలు ఐక్యంగా పోరాడాలి

బెల్లంపల్లిలో కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి
ఘనంగా నివాళులు అర్పించిన ఎంసీపీఐ (యు) నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ (యు) వ్యవస్థాపకుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ‘ప్రజాస్వామ్య హక్కులు–నియంతృత్వ ధోరణులు–వామపక్షాల కర్తవ్యం’ అనే అంశంపై పసులేటి వెంకటేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. అంతకుముందు ఓంకార్ స్మారక స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సాధించి దశాబ్దాలు గడిచినా దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, అత్యాచారాలు, హింసతో పాటు కుల, మత, ప్రాంతీయ విభేదాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలు ఈ సమస్యలను మరింత పెంచుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో ఆర్థిక దోపిడీతో పాటు కులమత తత్వాలు పెరిగాయని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ విధానాలను ప్రోత్సహిస్తూ మైనార్టీలు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలపై దాడులకు కారణమవుతోందని విమర్శించారు. కార్పొరేట్, పెట్టుబడిదారీ వర్గాలకు దేశ సంపదను కట్టబెడుతూ, ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై అణచివేత ధోరణులను అవలంబిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి స్వతంత్ర సంస్థలపై అధికార ప్రభావం పెరుగుతోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. ‘ఒకే దేశం–ఒకే మతం–ఒకే భాష’ వంటి భావజాలంతో పాటు జమిలి ఎన్నికల విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర అభివృద్ధి పేరుతో కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాద, మనువాద విధానాలకు, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, శ్రామిక వర్గాలు ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, మండల కార్యదర్శి సతీష్, మహిళా సమాఖ్య నాయకులు కాంపల్లి రాధ, దుర్గం లక్ష్మి, కామెర పద్మ, యువజన, విద్యార్థి నాయకులు నరేష్, శేఖర్, సాయి, రాం, మహేష్, ఆకాష్, అరుణ్‌తో పాటు వివిధ మండలాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});