ముఖ్య అతిథులుగా ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ,
సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మందమరి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో ఫ్యామిలీ డే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్. రాధాకృష్ణ, ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, స్థానిక ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి ఫ్యామిలీ డే, బతుకమ్మ వేడుకలను ఒకే కుటుంబంలా కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మ ఆటపాటలతో ప్రాంగణాన్ని సందడిగా మార్చారని పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడులను మరచి కుటుంబ సమేతంగా పండుగ వాతావరణంలో గడపడం సంతోషంగా ఉందన్నారు.
మహిళలకు వృత్తి శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ
2025–26 సంవత్సరానికి సంబంధించి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ వృత్తి శిక్షణ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను వారు అభినందించారు.

ఆటల పోటీలు, గ్రూప్ డ్యాన్స్‌లు ఆకర్షణ
వేడుకల్లో భాగంగా మహిళలకు, దంపతులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన గ్రూప్ డ్యాన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంప్రదాయాలకు అద్దం పట్టేలా అందంగా అలంకరించిన ఉత్తమ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. వివిధ ఆటల పోటీల్లో విజయం సాధించిన వారికి కూడా అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.చివరగా మహిళలందరూ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, ఆటలాడారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో బతుకమ్మ సంబరాలను కన్నులపండువగా ముగించారు.
పలువురు అధికారులు, నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘు కుమార్, సీఎంఓఏ సెక్రటరీ నరేష్, సీనియర్ పీఓ సురేందర్‌తో పాటు ఏరియా అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, సేవా సమితి ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});