దేశమే ప్రథమ ప్రాధాన్యం.. సమాజ మార్పే లక్ష్యం
పటోల్లా సంతోష్ రెడ్డి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీబీపేటలో బీబీపేట, బిక్నూర్, దోమకొండ మండలాల స్థాయిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రారంభిక్ శిక్షావర్గ ముగింపు (సమారోప్) సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు డాక్టర్ తంగలపల్లి సంతోష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పటోల్లా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రారంభించిన ఆర్ఎస్ఎస్, వందేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.

లక్షలాది మంది స్వయంసేవకులతో దేశంలో అనేక సామాజిక సంస్కరణలకు సంఘ్ ముందుండి కృషి చేస్తోందని పేర్కొన్నారు. 2025లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. వందేళ్ల ప్రస్థానం అనంతరం భవిష్యత్తులో సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి పంచ పరివర్తన కార్యక్రమానికి సంఘ్ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ భావన, పౌర విధుల నిర్వహణ వంటి అంశాల ద్వారా వ్యక్తులు, సంస్థలు, సమాజంలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వివరించారు.
ఆర్ఎస్ఎస్లో వ్యక్తిగత ప్రాధాన్యం కంటే సంస్థకు ప్రాధాన్యం ఉంటుందని, దేశమే అత్యంత ముఖ్యమనే భావనతో సంఘ్ కార్యకలాపాలు కొనసాగుతాయని పటోల్లా సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వల్లకటి సాయినాథ్, మోహన్ రెడ్డి, నరేందర్, హరీష్, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో మొత్తం 50 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});