CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 5:11 pm Posted By: coalbelt 24 News

బీబీపేట్‌లో ఆకట్టుకున్న సాధనశూరుల సాహస విన్యాసాలు

అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళలను కాపాడాలి: తుమ్మ మచ్చేందర్

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట్ గ్రామంలో కాళికాదేవి భక్తులైన సాధనశూరులు ప్రదర్శించిన అద్భుత సాహస విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామం నుంచి వచ్చిన సాధనశూరులు అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళలను ప్రదర్శిస్తూ ఇంద్రజాలం, కనికట్టు, పలు సాహస విన్యాసాలతో ప్రేక్షకులను అలరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ మాట్లాడుతూ, బీబీపేట్ గ్రామస్తులు, పద్మశాలీయులు సాధనశూరుల సంప్రదాయ కళలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని తెలిపారు. ప్రస్తుత తరానికి ఈ అరుదైన కళల గురించి పుస్తకాల ద్వారా తెలుసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం చాలా అరుదుగా లభిస్తోందని అన్నారు. సాధనశూరులు తమ గ్రామానికి వచ్చి సంప్రదాయ జానపద కళలను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సాధనశూరుల కళలు గ్రామాలకే పరిమితం కాకుండా పట్టణాల్లోనూ ప్రదర్శించేలా తన వంతు కృషి చేస్తానని మచ్చేందర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ అరుదైన జానపద కళలు సజీవంగా కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సాధనశూరులకు తగిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆదరణ లేకపోతే ఈ కళలు క్రమంగా అంతరించిపోయి, భవిష్యత్తులో పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జానపద కళాకారులను ఆదరించి, వారి కళలను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి బీబీపేట్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంకాలం నరేందర్ ముందుండి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మ రవీందర్, మహిళా అధ్యక్షురాలు చందుపట్ల జమున, దుడుగు సంతోష్, చందుపట్ల శ్రీహరి, చింతకింది వేణు, చింత లింగం, క్యాతం శంకర్, దుడుగు గణేష్, అవధూత విఠల్‌తో పాటు పద్మశాలి సంఘం బంధుమిత్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});