సింగరేణి యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి:
సింగరేణి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి
రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్ .(బెల్లంపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కార్మిక చట్టాలు, మానవ హక్కులు, ప్రపంచ ఆరోగ్య సూత్రాలను అమలు చేయకుండా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం శోచనీయమని ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు.
మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ప్రలోభాలకు లొంగకుండా తమ రాజకీయ చైతన్యాన్ని చాటారని పేర్కొన్నారు. మద్యం, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ వంటి ప్రలోభాలను పక్కనపెట్టి ఎర్రజెండా ఐక్య కూటమికి మద్దతుగా నిలిచి 77 డిపోలలో విజయాన్ని అందించడం శుభపరిణామమని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ విప్లవ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తోందని పేర్కొన్నారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం విడనాడాలి
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను మార్చుకోవాలని, కార్మికులను గౌరవప్రదంగా చూడాలని సూచించారు. విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్‌తో అక్టోబర్ 13న హైదరాబాద్‌లో విద్యుత్ సంస్థల కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
మెడికల్ బోర్డు విధానాలు మార్చాలి
సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షల్లో ప్రపంచ ఆరోగ్య సూత్రాలు, సంస్థ వైద్య మార్గదర్శకాలను పాటించాలని వెంకటస్వామి కోరారు. ఏ ఉద్యోగానికీ అర్హత లేని కార్మికులను సైతం ‘ఫిట్ ఫర్ సేమ్ జాబ్’గా నిర్ధారించడం వల్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటూ, కార్మికుల ఆరోగ్య పరిస్థితులను మానవీయ దృక్పథంతో పరిశీలించి, అర్హులైన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
40 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించాలి
విజయదశమి సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాను ఇప్పటివరకు ప్రకటించకపోవడంపై వెంకటస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ నికర లాభాలను ప్రకటించకుండా కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను 40 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీకి మద్దతివ్వాలి
సింగరేణిలో కార్మిక చట్టాల అమలు, పారిశ్రామిక సంబంధాల నిర్వహణ, అవసరమైన మెటీరియల్ సరఫరా వంటి అంశాల్లో సమస్యలు నెలకొన్నాయని వెంకటస్వామి విమర్శించారు. కార్మికులు ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, చట్టబద్ధమైన హక్కులను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఎర్రజెండా యూనియన్ నాయకత్వానికి కార్మిక వర్గం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ గేట్ మీటింగ్‌కు రత్నం ప్రవీణ్ ఫిట్ కార్యదర్శి అధ్యక్షత వహించారు. బ్రాంచ్ కార్యదర్శి మంతెన రమేష్, రత్నం ఐలయ్య, ఏఐటీయూసీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు, దాడి రమేష్ సహాయ కార్యదర్శి, రామకృష్ణ, అంజత్ ఖాన్, రాజేశం తదితరులతో పాటు ఎస్కే మైన్ మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});