CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 9:11 pm Posted By: coalbelt 24 News

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

రైతుబంధు సాయం ఆలస్యం
సాగునీరు, విద్యుత్‌ కొరతతో రైతులకు ఇబ్బందులు
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్యం కారణంగా రైతాంగం ఇబ్బందులకు గురవుతోందని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ విమర్శించారు. రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందకపోవడం, సాగునీటి కొరత, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గోదావరి నదిలో దిగువకు ప్రవహిస్తున్న వరద జలాలను అవసరమైన సమయంలో ఎత్తిపోసి సాగునీటి అవసరాలకు వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ లేకపోవడంతో పంటలకు నీటి కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. మరోవైపు వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా కాకపోవడం, విద్యుత్‌ నాణ్యతలో లోపాల కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగు ప్రారంభం నుంచి దిగుబడి చేతికొచ్చే వరకు రైతులు పెట్టుబడులు, సాగునీరు, విద్యుత్‌ సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత భారంగా మారుతోందని విమర్శించారు.

రైతులకు తక్షణమే భరోసా కల్పించాలి

రైతులకు రైతుబంధు, రైతు భరోసా పథకాల కింద అందాల్సిన ఆర్థిక సాయాన్ని సకాలంలో అందించాలని సలేంద్ర కొమురయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు.నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ సాగునీటి చర్యలు చేపట్టడంతో పాటు, పంట నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయ రంగానికి భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});