CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 5:40 pm Posted By: coalbelt 24 News

రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని కాసిపేట ఆరోగ్య ఉపకేంద్రం!

లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా
ప్రారంభానికి ముందే గోడలకు పగుళ్లు
పిచ్చిమొక్కలతో నిండిన ఆవరణ
మూలకు చేరిన విలువైన బాడీ ఫ్రీజర్

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రం రెండేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోకపోవడం విచారకరం. ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన వైద్య కేంద్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభానికి ముందే భవనం గోడలకు పగుళ్లు ఏర్పడగా, పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన విలువైన బాడీ ఫ్రీజర్ సైతం మూలకు చేరి నిరుపయోగంగా మారింది.

వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంతోపాటు గర్భిణులకు వైద్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఇతర ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య ఉపకేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాసిపేటలో ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభమైతే స్థానిక ప్రజలకు వైద్య సేవలు చేరువవుతాయని భావించినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో ప్రజలకు నిరాశే మిగిలింది. చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రారంభానికి ముందే భవనానికి పగుళ్లు………..

లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం రెండేళ్లుగా నిరుపయోగంగా ఉండటమే కాకుండా, ప్రారంభానికి ముందే గోడలకు పగుళ్లు ఏర్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. భవన నిర్మాణ నాణ్యతపై సంబంధిత అధికారులు పరిశీలన జరిపి, పగుళ్లకు గల కారణాలను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే భవనం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు స్పందించి ప్రారంభించాలి…….

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, వైద్య సిబ్బందిని నియమించి, అవసరమైన వైద్య పరికరాలు, మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్య సదుపాయాలు నిరుపయోగంగా ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఏఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, కొడప అనంతరావు, రాయి సెంటర్ మేటి ఆదివాసీ నాయకుడు, సామాజిక కార్యకర్తలు శిలోజు మురళి, సిరాజ్ ఖాన్, బుగ్గగూడెం ఉపసర్పంచ్ మెండ్రపు రాజయ్య, వార్డు సభ్యుడు నిచ్చకొల్ల శంకర్, బీఆర్‌ఎస్ పార్టీ మండల ఇన్‌చార్జి సోదారి సురేష్, కాంగ్రెస్ యువజన నాయకుడు భూక్యా తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});