CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:40 pm Posted By: coalbelt 24 News

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం
1500 మంది క్రీడాకారుల హాజరు
ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలి
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్

కోల్ బెల్ట్ న్యూస్(ఆసిఫాబాద్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని, నిరంతర సాధనతో జాతీయ స్థాయికి ఎదగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవడంతోపాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్‌ను తిలకించి, వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, యువ క్రీడాకారులు ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే క్రీడలపై దృష్టి సారించి, నిరంతరం సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఎంపీ పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు.

జిల్లాలోని పాఠశాలలకు క్రీడా పరికరాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గోడం నగేష్ తెలిపారు. నవంబర్ నెలలో సుమారు 200 పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు సరఫరా కానున్నాయని వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా కార్యదర్శులు, మేనేజర్లు, కోచ్‌లు, క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 1,500 మంది క్రీడాకారులు పాల్గొనడం పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలబాలికలు వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నికిత పంత్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, అథ్లెటిక్స్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనపర్తి రమేష్, ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా స్పోర్ట్స్ అధికారి పార్థసారథి, ఏసీఎంఓ ఉద్దవ్, బండ మీనారెడ్డి, యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట్నాక విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});