CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 12:07 pm Posted By: coalbelt 24 News

బతుకమ్మ వేడుకలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ చీఫ్ కవిత!

26 జిల్లాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు
ఓయూ నుంచి యూసఫ్‌గూడ వరకు కవిత పర్యటన షెడ్యూల్‌ ఖరారు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్‌ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ కార్యక్రమాలతో కూడిన షెడ్యూల్‌ను రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుకలు 18న సద్దుల బతుకమ్మ వరకు కొనసాగనున్నాయి.

ఈ వేడుకల్లో భాగంగా కవిత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరిగే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నారు. అక్టోబర్‌ 11న సాయంత్రం 5 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరవుతారు. 12న ఉదయం 11 గంటల నుంచి బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్టోబర్‌ 14న రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో కవిత బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మియాపూర్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదే వేదికపై సాయంత్రం 5 గంటలకు మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు సెంట్రల్‌ యూనివర్సిటీలో నిర్వహించే బతుకమ్మ సంబురాలకు హాజరవుతారు. అనంతరం అక్టోబర్‌ 17న సాయంత్రం 6 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొననున్నారు.

సంస్కృతితో పాటు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి…….

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణకు ప్రణాళిక రూపొందించడం, మరోవైపు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం, మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో సంబంధాలను బలోపేతం చేసుకునే వేదికలుగా నిలవనున్నాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ప్రధానంగా ప్రస్తావిస్తూ తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా బతుకమ్మ పండుగను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ వేడుకల ద్వారా పార్టీకి రాజకీయంగా ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆయా కార్యక్రమాల్లో ప్రజలు, మహిళలు, పార్టీ కార్యకర్తల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});