CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 3:04 pm Posted By: coalbelt 24 News

బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

చెరువులోని వినాయక విగ్రహాలను తొలగించాలి
లైటింగ్‌ ఏర్పాటు, భద్రతకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు కోరారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హిందూ సంప్రదాయంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధాన్ని చాటుతూ కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారని నరసింహులు పేర్కొన్నారు. బిబిపేట మండలంలో ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెరువులో వినాయక విగ్రహాలతో ఇబ్బందులు…..

ఇటీవల బిబిపేట మండల చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగడంతో విగ్రహాలు చెరువులోనే ఉండిపోయాయని, దీంతో బతుకమ్మలు ఆడుకునేందుకు మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నరసింహులు తెలిపారు. చెరువులో ఉన్న విగ్రహాలను జేసీబీల సహాయంతో తొలగించి పక్కకు తరలించాలని కోరినా, ఇందుకు అవసరమైన నిధులు అందుబాటులో లేవని అధికారులు స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.పండుగ సమయంలో ఆడపడుచులు బతుకమ్మలను తీసుకుని చెరువు వద్దకు వెళ్లే క్రమంలో ఎలాంటి అసౌకర్యాలు, ప్రమాదాలు జరగకుండా అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. బతుకమ్మ వేడుకలు సజావుగా నిర్వహించేందుకు చెరువు పరిసరాలను శుభ్రం చేసి, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

లైటింగ్‌, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి……..

బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, చీకటి పడిన తర్వాత కూడా మహిళలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు. చెరువు వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, తొమ్మిది రోజులపాటు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని, సంబంధిత అధికారులు, గ్రామస్థాయి బాధ్యులు సమన్వయంతో పనిచేసి మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కొరివి నరసింహులు విజ్ఞప్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});