CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 3:49 pm Posted By: coalbelt 24 News

మందమర్రి ఏరియాలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలి: జీఎం ఎన్. రాధాకృష్ణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ‘స్పెషల్ డెడికేటెడ్ డ్రైవ్ – స్వచ్ఛత కార్యక్రమం’లో భాగంగా శుక్రవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల) సేకరణ, శాస్త్రీయ పద్ధతిలో విసర్జనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయ పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న, పాడైపోయిన ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్, మానిటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ-వేస్ట్ సేకరణ డబ్బాలో వేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, సరైన పద్ధతిలో తొలగించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ-వేస్ట్‌ను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో విసర్జించడం ద్వారా పర్యావరణానికి కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కార్యాలయాల్లోనే కాకుండా ఇళ్లలోనూ నిరుపయోగంగా ఉన్న పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, వైర్లు, స్విచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, నిర్దేశిత విధానంలో సేకరించి పారవేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యాలయాలు, గనుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు భూగర్భ, వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు, ఉద్యోగులు అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పరిశుభ్రమైన పరిసరాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏరియా ఈఅండ్‌ఎం ఏజీఎం బాలాజీ భగవతీ జా, ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కే. ప్రసాద్, డీజీఎం (సర్వే) బుఖ్యా దేశాయి, ఐటీ డిప్యూటీ మేనేజర్ రవి, పర్చేస్ అధికారి బాబు, ఏరియా అటవీ శాఖ అధికారి నవీన్‌తో పాటు జీఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});