ఎండిపోతున్న పంటలను కాపాడాలి
లేకుంటే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తాం:
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ బుధవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత లోపాలతో పొట్ట దశకు చేరుకున్న వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కళ్లముందే ఎండిపోతుండటాన్ని చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
రైతులకు సరఫరా చేస్తున్న విద్యుత్ కూడా అరకొరగా ఉండటంతో పాటు, నాణ్యత సరిగా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆయన తెలిపారు. దీంతో రైతులు ఆర్థికంగా మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు” అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని కొమురయ్య యాదవ్ అన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కొమురయ్య యాదవ్ హెచ్చరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});