CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:43 pm Posted By: coalbelt 24 News

సింగరేణి ఆస్తుల చోరీ యత్నం భగ్నం

ఎంటీఎఫ్ సిబ్బంది అప్రమత్తతతో రెండు కరెంట్ మోటార్లు స్వాధీనం
శాలువాతో సన్మానం, బహుమతుల ప్రదానం
ఎం‌టీఎఫ్ సిబ్బందికి జీఎం ఎన్. రాధాకృష్ణ ప్రశంసలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించడంలో ఎస్ అండ్ పీసీ (S&PC) సెక్యూరిటీ విభాగం, మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ ఫోర్స్ (MTF) సిబ్బంది చూపుతున్న అప్రమత్తత, చాకచక్యం అభినందనీయమని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్  ఎన్. రాధాకృష్ణ పేర్కొన్నారు.

బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మందమర్రి ఏరియాలోని మంజునాథ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న సోలార్ ప్లాంట్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎం‌టీఎఫ్ సిబ్బందికి ఒక వ్యాన్ అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో సింగరేణి సంస్థకు చెందిన రెండు ఖరీదైన విద్యుత్ మోటార్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై చాకచక్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బంది మోటార్లతో పాటు వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని సెక్యూరిటీ కార్యాలయంలో భద్రపరిచారు.

సకాలంలో స్పందించి సింగరేణి ఆస్తులను కాపాడిన సెక్యూరిటీ సిబ్బందిని జీఎం ఎన్. రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. వారి విధి నిర్వహణలో చూపిన నిబద్ధతను కొనియాడుతూ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు, బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, “మనం పనిచేస్తున్న సింగరేణి సంస్థ మన అందరి ఆస్తి. సంస్థ సొత్తును పరిరక్షించడం ప్రతి ఉద్యోగి ప్రాథమిక బాధ్యత. సెక్యూరిటీ విభాగం సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ సంస్థ ఆస్తులను కాపాడటం శుభపరిణామం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి చోరీలను అరికడితే సంస్థ నష్టాల బారిన పడకుండా లాభాల బాటలో పయనిస్తుంది. సంస్థ పురోగతి సాధించినప్పుడే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం మరింత మెరుగ్గా అమలవుతుంది. భవిష్యత్తులో కూడా సెక్యూరిటీ విభాగం ఇదే అప్రమత్తతతో విధులు నిర్వహించాలని” పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎం ఎస్‌వో జి.ఎల్. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏరియా సెక్యూరిటీ అధికారి  వెంకటేశ్వర్ రెడ్డి, సెక్యూరిటీ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});