CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 7:53 pm Posted By: coalbelt 24 News

అమరులు కలలుగన్న సమాజ నిర్మాణమే వారికి నిజమైన నివాళి

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

అమరులు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘అమరుల యాది’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజంలోని సబ్బండ వర్గాలు, అన్ని కులాలకు అధికారంలో సముచిత భాగస్వామ్యం లభించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సమాజం కోసం ఒక వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్నప్పుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక వేదనను అనుభవిస్తారో తనకు తెలుసని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిమ్స్‌లో 11 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సమయంలో కుటుంబ సభ్యులుగా తాము ఎంతటి నరకయాతన అనుభవించామో తనకు మాత్రమే తెలుసన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌తో రాజకీయంగా విభేదించినప్పటికీ, తమ దారులు వేరైనప్పటికీ తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మరచిపోకూడదని అన్నారు. అదేవిధంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులతోపాటు, మెరుగైన సమాజం కోసం గతంలో ఈ ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన మావోయిస్టుల త్యాగాలను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారు ఆశించిన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అమరుల త్యాగాల ఫలాలు అందరికీ అందాయా?

అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు నిజంగా అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయా అనే అంశంపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పేద ప్రజలు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కోసం పోరాడుతూనే ఉన్నారని పేర్కొంటూ, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు.గతంలో భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయని, ప్రస్తుతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న వారిపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. దోపిడీ విధానం మారిందే తప్ప, దోపిడీ చేసే వారి స్వభావం మారలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే నిరంతర పోరాటం అవసరమని స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి యువత, మహిళలు రావాలి

యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా పాలనలో భాగస్వాములు అయినప్పుడే సమాజంలో ఆశించిన మార్పు సాధ్యమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. మాజీ మావోయిస్టులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమరుల ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చి, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});