CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:47 am Posted By: coalbelt 24 News

బీబీపేట్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ

రోడ్డుపైకి చేరుతున్న తాగునీరు
కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికుల ఆందోళన

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మండల కేంద్రం నుంచి తుజాల్‌పూర్‌ వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిపై మిషన్‌ భగీరథ తాగునీటి పైప్‌లైన్‌ పగిలిపోవడంతో నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనాల రాకపోకల ద్వారా మట్టి, దుమ్ము, వివిధ రకాల క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా తాగునీటిలో కలిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

తాగునీటి పైప్‌లైన్‌ పగిలిన ప్రాంతంలో రహదారిపై వాహనాలు నిరంతరం రాకపోకలు సాగించడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు తెలిపారు. కలుషిత నీటిని ప్రజలు వినియోగిస్తే విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో పారిశుధ్య సమస్యలు, దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టి, రోడ్డుపైకి వస్తున్న నీటిని నిలిపివేయడంతో పాటు పైప్‌లైన్‌లోకి కలుషిత నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్‌ చేశారు. అలాగే సంబంధిత అధికారులు లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

ఈ సందర్భంగా ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు మాట్లాడుతూ.. తాగునీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పైప్‌లైన్‌ పగిలి నీరు రోడ్డుపైకి వస్తున్న విషయం సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కరించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌ లీకేజీని మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలు ఈ నీటిని వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తితే సంబంధిత గ్రామపంచాయతీ, ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొరివి నరసింహులు హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});