CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 11:25 am Posted By: coalbelt 24 News

పార్టీ నిధుల దుర్వినియోగంపై బీజేపీ సీరియస్‌..!

డబ్బులు కాజేస్తే క్రిమినల్‌ కేసులు తప్పవు: అభయ్‌ పాటిల్‌ హెచ్చరిక
క్షేత్రస్థాయిలో పనిచేయాలి.. ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు: మధుకర్‌
రాష్ట్ర పదాధికారుల సమావేశంతో నాయకుల్లో ఒక్కసారిగా అలర్ట్‌

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర సహ ప్రభారీ అభయ్‌ పాటిల్‌, పార్టీ నూతన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌తో పాటు పలువురు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పార్టీ నిధుల వినియోగం తదితర అంశాలపై నేతలు సీరియస్‌గా చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా అభయ్‌ పాటిల్‌ గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం పంపించిన నిధుల వ్యవహారంపై తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అభ్యర్థులకు అందించాల్సిన పార్టీ డబ్బులను వారికి ఇవ్వకుండా, పార్టీ ప్రచారానికి వినియోగించకుండా కొందరు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నిధులను దుర్వినియోగం చేసిన వారిని ఇప్పటికే గుర్తించామని, వారు వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. లేనిపక్షంలో క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు అందకుండా వాటిని ఇతర అవసరాలకు వినియోగించిన వారిపై అవసరమైతే కేసులు పెట్టించి జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమని జిల్లా అధ్యక్షులను పాటిల్‌ హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ పదవుల్లో ఉన్న వారు కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం. తాను రాష్ట్రంలో తాత్కాలికంగా ఉన్నానని, ఎప్పుడెప్పుడు వెళ్లిపోతానా అని కొందరు భావించారని, అయితే పార్టీ తన బాధ్యతను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తాను ఎక్కడికీ వెళ్లబోనని, ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని అభయ్‌ పాటిల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు………….

పార్టీ నూతన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌ మాట్లాడుతూ పదవులు పొందిన నాయకులు ఏసీ గదుల్లో కూర్చోవడం కాకుండా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పార్టీలో క్రియాశీలక సభ్యత్వం లేని సుమారు 30 మందికి పదవులు ఎలా కట్టబెట్టారంటూ మధుకర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశం జరుగుతున్న సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ నేతను బయటకు పంపించినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జిల్లా అధ్యక్షులతో ప్రత్యేక భేటీ………

సమావేశం అనంతరం అభయ్‌ పాటిల్‌ కొంతమంది జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిలను కూడా సమావేశానికి పిలిచి ఉంటే బాగుండేదని కొందరు జిల్లా అధ్యక్షులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిధుల పంపిణీలో జిల్లా అధ్యక్షులతో పాటు ఎన్నికల ఇన్‌చార్జిల పాత్ర కూడా ఉందని, కొందరు ఇన్‌చార్జిలు సైతం నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు వారు వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా పార్టీ కార్యాలయాల నిర్వహణకు అయ్యే ఖర్చులను భరించడం తమకు భారంగా మారుతోందని, కార్యాలయాల నిర్వహణ కోసం పార్టీ నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని కేటాయించాలని జిల్లా అధ్యక్షులు కోరినట్లు సమాచారం. వారి విజ్ఞప్తిపై పార్టీ అగ్రనాయకత్వం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నాయకుల్లో కొత్త ఉత్సాహం.. అలర్ట్‌ మోడ్‌లో పార్టీ………

సమావేశంలో నాయకత్వం వ్యవహరించిన తీరుతో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల్లో ఒక్కసారిగా అప్రమత్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ అనేక ఆఫీస్‌ బేరర్ల సమావేశాలు జరిగినప్పటికీ, ఇంత కఠినంగా, స్పష్టమైన ఆదేశాలతో సమావేశం జరగడం ఇదే తొలిసారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఇన్నాళ్లూ నాయకత్వం చెబుతూ వస్తున్నప్పటికీ, ఈసారి సమావేశంలో కనిపించిన సీరియస్‌నెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసినట్లు సమాచారం. ఇదే క్రమశిక్షణ, ఇదే దూకుడు భవిష్యత్‌లోనూ కొనసాగితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యమేనన్న అభిప్రాయం పలువురు నాయకుల్లో వ్యక్తమైనట్లు తెలిసింది. మొత్తంగా ఈ సమావేశాన్ని పార్టీ శ్రేణులు సంస్థాగతంగా మరింత కట్టుదిట్టం చేసుకునే దిశలో శుభపరిణామంగా అభివర్ణిస్తున్నాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});