CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:16 pm Posted By: coalbelt 24 News

బీజేపీ జిల్లా నాయకత్వంపై సీనియర్ నేతల తీవ్ర ఆరోపణలు

రఘునాథ్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శలు
జిల్లా అధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మడిపల్లి సత్యనారాయణ (సత్యం) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లా పార్టీలో ఎర్రబెల్లి రఘునాథ్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయనకు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని, మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను అణచివేస్తూ, రఘునాథ్‌కు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే సీనియర్ నాయకులను పక్కనపెట్టి, వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పార్టీ పదవులు, బాధ్యతలు కల్పిస్తున్నారని ఆరోపించారు.

 

రఘునాథ్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులపై గతంలో పేకాట, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, మోసాలు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం తదితర ఆరోపణలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో వివాదాల్లో ఉన్న వ్యక్తులకు పార్టీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు కల్పించడం ద్వారా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎన్‌హెచ్‌–63 అంశంపై ఆరోపణలు………..

ఎన్‌హెచ్‌–63 రహదారి అలైన్‌మెంట్ విషయంలో కూడా రఘునాథ్‌పై వారు పలు ఆరోపణలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఇతర వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు గతంలో పత్రికల్లో ప్రచురితమయ్యాయని తెలిపారు. రహదారి అలైన్‌మెంట్ మార్పుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. గత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో పార్టీ నిధులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారని తెలిపారు.

నిజాయితీ కార్యకర్తలపై చర్యలు తగవు……..

పార్టీలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినందుకే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బొలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యనారాయణ ఆరోపించారు. నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా అధ్యక్షుడిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకులను అణచివేసే ప్రయత్నాల్లో భాగంగానే సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, పార్టీతో సంబంధం లేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం వంటి చర్యలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మడిపల్లి సత్యనారాయణపై ఎలాంటి కారణం లేకుండా కక్షపూరితంగా సస్పెన్షన్‌ వేటు వేయడం అన్యాయమని బొలిశెట్టి తిరుపతి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తనపై, ఇతర నాయకులపై పత్రికా ప్రకటనలు చేయడంతో వాటికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇకపై రఘునాథ్ వ్యవహారశైలిని సహించబోమని స్పష్టం చేశారు.

రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలి………….

జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌ను వెంటనే జిల్లా బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని వారు కోరారు. ఎర్రబెల్లి రఘునాథ్ వ్యవహారశైలిపై రాష్ట్ర పార్టీ ప్రత్యేక దృష్టి సారించి, పార్టీకి నష్టం కలిగించే చర్యలను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. రఘునాథ్‌కు పార్టీ బాధ్యతల నుంచి విముక్తి కల్పించే విషయాన్ని రాష్ట్ర కమిటీ పరిశీలించాలని, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకులకు పార్టీలో సముచిత స్థానం, ప్రాధాన్యత కల్పించేలా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొలిశెట్టి తిరుపతి (మాజీ హాజీపూర్ మండల అధ్యక్షుడు), మడిపల్లి సత్యనారాయణ (బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు) సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});