CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:26 pm Posted By: coalbelt 24 News

డెంగ్యూ, విషజ్వరాలతో మంచిర్యాల జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కరిస్టు–మార్క్సిస్టు) (CPI(AM)) జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపాలు, దోమల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా, వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గత ఐదు రోజులుగా CPI(AM) జిల్లా నాయకులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలతో పాటు పలు ఆసుపత్రులను సందర్శించారు. జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను, బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని నాయకులు తెలిపారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యమే కారణం…..

జిల్లాలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దోమల ఉద్ధృతి పెరిగిందని CPI(AM) జిల్లా కమిటీ ఆరోపించింది. పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం, మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొంది. దోమల నివారణకు మందు పిచికారీ చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. దోమలు కుట్టిన ప్రాంతాలను గోకడం వల్ల కొందరికి పుండ్లు ఏర్పడి, కాళ్లు సెప్టిక్ అవుతున్నాయని, దీంతో బాధితులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వస్తోందని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ వైద్యం మెరుగుపర్చాలి……

డెంగ్యూ, విషజ్వరాల బారిన పడుతున్న బాధితులకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని CPI(AM) నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, పరీక్షా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయడంతో పాటు వ్యాధుల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

CPI(AM) డిమాండ్లు

  1. జిల్లా వ్యాప్తంగా తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలి.
  2. దోమల నివారణకు అన్ని ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలి.
  3. గ్రామాలు, పట్టణాల్లో బ్లీచింగ్ పౌడర్‌ను విస్తృతంగా చల్లాలి.
  4. ప్రజలకు శుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలి.
  5. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి.
  6. జ్వరాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలి.

ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని విడనాడి తక్షణమే చర్యలు చేపట్టాలని CPI(AM) మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో CPI(AM) మంచిర్యాల జిల్లా కన్వీనర్ సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దాసరి రాజేశ్వరి, గట్టు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});