మందమర్రి ఏరియాలో ఘనంగా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ, రామలీల ఉత్సవాల నిర్వహణ
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో దసరా సంబరాలు
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మందమర్రి సింగరేణి ఏరియాలో ఫ్యామిలీ డే ఆటపాటలు, సద్దుల బతుకమ్మ, రామలీల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉత్సవాలు జరిగే అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.
రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం గ్రౌండ్, మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్, సోమగూడెం గ్రౌండ్, బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్‌లను ముందుగానే శుభ్రపరిచి, ఉత్సవాలకు అనువుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రామలీల కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సమీక్షా సమావేశంలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, మందమర్రి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, బెల్లంపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ సెక్రటరీ అక్బర్ అలీ, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మురళి, డీజీఎం (సివిల్) మదీనా భాష, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ (ఎస్ అండ్ పీసీ) వెంకటేశ్వర రెడ్డి, వర్క్‌షాప్ (ఎస్‌ఈ) నరేష్, సీనియర్ పీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});