CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:23 pm Posted By: coalbelt 24 News

గురుపరంపర గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ‘వందే గురుపరంపర’

రామకోటయ్య కళాసేవకు ఘన నివాళి
కూచిపూడి నాట్య వైభవాన్ని చాటిన కళా ప్రదర్శనలు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రముఖ నాట్యాచార్యులు భాగవతుల రామకోటయ్య సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, శిష్యుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి నాట్యగురువు భాగవతుల సేతురామ్‌ ఆధ్వర్యంలో ‘వందే గురుపరంపర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 30న బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగవతుల సాయిమోహిత్‌ రామ్‌ నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు.

గురుశిష్య పరంపర గొప్పతనాన్ని, కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ కళాకారులు, నాట్య గురువులు పాల్గొని భాగవతుల రామకోటయ్య కళాసేవలను స్మరించుకున్నారు. అనుపమా కైలాశ్‌, డాక్టర్‌ స్వాతి సోమనాథ్‌, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణ, డాక్టర్‌ వనజా ఉదయ్‌, రంగమణి, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ భారతి, డాక్టర్‌ విజయపాల్‌ తదితరులు పాల్గొన్నారు. రామకోటయ్య శిష్యులు, కళాకారులు, నాట్యాభిమానులు, కుటుంబ సభ్యులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భాగవతుల సేతురామ్‌ మాట్లాడుతూ గురుపరంపర అంటే కేవలం నాట్య విద్యను నేర్చుకోవడం మాత్రమే కాదన్నారు. గురువు నుంచి కళతో పాటు భక్తి, శ్రద్ధ, వినయం, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, మానవీయ విలువలను నేర్చుకుని వాటిని జీవితంలో ఆచరించడమే నిజమైన గురుపరంపర అని పేర్కొన్నారు. తన తండ్రి రామకోటయ్య నాట్యాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విలువలను ప్రజలకు చేరువ చేసే సాధనంగా మలిచారని గుర్తుచేశారు.

కూచిపూడి విస్తరణకు విశేష కృషి……

తెలంగాణలో కూచిపూడి నాట్య విస్తరణకు భాగవతుల రామకోటయ్య విశేష కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. అనేక మంది శిష్యులకు నాట్య శిక్షణ అందించడంతో పాటు మహిళలకు నృత్య విద్యను అందించేందుకు ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. ‘పిండోత్పత్తి’, ‘సృష్టి తత్వం’, ‘జీవాత్మ–పరమాత్మ’ వంటి ఆధ్యాత్మిక, తాత్విక అంశాలను నృత్యరూపకాలుగా మలిచి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు.

నందిని నృత్యాలయం శిష్య బృందం పాల్గొనడం…..

కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, శిష్య బృందాలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన నందిని నృత్యాలయం ఫౌండర్‌, నాట్యగురువు అన్నం కల్పనతో పాటు ఆమె శిష్య బృందం కూడా పాల్గొని భాగవతుల రామకోటయ్య కళాసేవను స్మరించుకుంది. గురుపరంపరను స్మరిస్తూ నిర్వహించిన ‘వందే గురుపరంపర’ కార్యక్రమం కళాభిమానుల హర్షధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});