CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:29 pm Posted By: coalbelt 24 News

ముదిరాజ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

జీవో నంబర్‌ 6ను తక్షణమే అమలు చేయాలి
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురు నరసింహులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ముదిరాజ్ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, జీవో నంబర్‌ 6ను తక్షణమే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి గురు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ముదిరాజ్ కుటుంబాలు తరతరాలుగా చెరువులు, కుంటలపై ఆధారపడి చేపల పెంపకం, విక్రయాల ద్వారా జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్‌లకు జీవనోపాధి కల్పించేలా మూడు ఎకరాల భూమి కేటాయించి, పండ్లు, పలహారాలు తదితర ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు.

గ్రామాల్లోని చెరువులు, కుంటలకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని నరసింహులు కోరారు. కొన్ని గ్రామాల్లో ముదిరాజ్ జనాభా అధికంగా ఉన్నప్పటికీ, చెరువులు, కుంటల్లో ఇతర వర్గాలకు సంబంధించిన సమస్యల కారణంగా ముదిరాజ్‌లకు చేపల పెంపకం, సభ్యత్వం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వేసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్న ముదిరాజ్‌లు ప్రభుత్వ ఆంక్షలు, ఒత్తిళ్ల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో ముదిరాజ్‌లకు చట్టబద్ధమైన హక్కులు, జీవనోపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రతి గ్రామంలో ముదిరాజ్ సోదరులు ధైర్యంగా చేపల పెంపకం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా జీవో నంబర్‌ 6ను తక్షణమే అమలు చేయాలని గురు నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});