మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు
ఆరు నెలల క్రితమే చోరీకి పథకం..
ఉన్నతాధికారిపై కక్షతోనే ఘటనకు పాల్పడినట్లు అనుమానం
మాజీ హవిల్దార్ మల్లేశ్‌పై గతంలోనూ చోరీ కేసులు
ఆర్మీలో ఎలా ఎంపికయ్యాడన్న కోణంలో దర్యాప్తు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మద్రాస్ రెజిమెంట్ ఆయుధగారంలో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అరెస్టైన మాజీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు (37) ఆరు నెలల క్రితమే ఆయుధగారంలో చోరీ చేయాలని పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. గతేడాది మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ ఆర్మీ ఉన్నతాధికారితో మల్లేశ్‌కు వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ అధికారి పట్ల కక్ష పెంచుకున్న మల్లేశ్.. ఆయుధగారంలో చోరీ చేస్తే సంబంధిత ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు మల్లేశ్ సస్పెన్షన్‌కు గురికావడంతో ఆ అధికారిపై అతడి అసంతృప్తి మరింత పెరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆగస్టు 30 అర్ధరాత్రి మద్రాస్ రెజిమెంట్‌లోని కార్గిల్ గేటు వైపు నుంచి ఆయుధగారం లోపలికి మల్లేశ్ ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి 12 అధునాతన తుపాకులు, 1,920 బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్లు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆగస్టు 31 ఉదయం అధికారులు ఆయుధగారాన్ని తనిఖీ చేయగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సంఖ్యలో తేడా కనిపించింది. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడు మల్లేశ్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం.
మల్లేశ్ నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తుండగా అతడిపై గతంలోనూ చోరీ కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2005లో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో అతడిపై ఓ చోరీ కేసు నమోదైనట్లు సమాచారం. అలాగే 2007లో ఆమ్రాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేసిన కేసులోనూ మల్లేశ్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
అయితే 2010లో మల్లేశ్ భారత సైన్యంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో చోరీ కేసులు నమోదైన వ్యక్తి సైన్యంలోకి ఎలా ఎంపికయ్యాడనే అంశంపై ప్రస్తుతం పోలీసు, ఆర్మీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అప్పటి కేసులు వీగిపోవడం లేదా వాటికి సంబంధించిన రికార్డుల ఆధారంగా అతడి ఎంపిక జరిగి ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. ఆయుధాల చోరీ వెనుక మల్లేశ్ ఉద్దేశం, గతంలో నమోదైన కేసుల వివరాలు, సైన్యంలో అతడి నియామకం సమయంలో జరిగిన పరిశీలన తదితర అంశాలపై పోలీసులు, ఆర్మీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});