Date of Publish : 22 September 2026, 1:10 pmPosted By: coalbelt 24 News
క్రీడల్లోనూ సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చాటాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియా స్థాయి క్రీడాపోటీలను మంగళవారం సింగరేణి పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా నిర్వహించారు. ఏరియాలోని సింగరేణి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఏరియా స్థాయిలో పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న క్రీడాకారులు ఆయా విభాగాల్లో పోటీపడి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి కోల్ ఇండియా స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేయనున్నారు.
ఈ క్రీడాపోటీలను మందమర్రి సింగరేణి ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ప్రసాద్, మందమర్రి ఏరియా కార్మిక గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు భీమనాదుని సుదర్శన్, సీనియర్ పీవో కార్తీక్, స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఉద్యోగుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ క్రీడారంగంలోనూ రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. మందమర్రి ఏరియాకు చెందిన క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏరియాకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు ఉద్యోగుల్లో ఆరోగ్యకరమైన పోటీ, క్రమశిక్షణ, ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.క్రీడాపోటీల సందర్భంగా సింగరేణి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. పోటీల నిర్వహణకు సంబంధిత అధికారులు, క్రీడా విభాగం సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.