సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి మందమరి డివిజన్ పరిధిలో ఎస్ & పీసీ ప్రైవేటు సెక్యూరిటీ విభాగంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న సుమారు 70 మంది సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS–CTU) గౌరవధ్యక్షులు సంకె రవి, కార్యదర్శి. దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మందమర్రిలో వారు మాట్లాడుతూ …..టెండర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 50 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా గత నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. మరో 19 మంది కార్మికులను గత టెండర్లలో జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ విధుల నుంచి తొలగిస్తున్నారని తెలిపారు.
మొత్తంగా సుమారు 70 మంది గార్డులు ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారుల కారణంగా టెండర్ ప్రక్రియలో సమస్యలు ఏర్పడితే కొత్త టెండర్ పిలిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ దాదాపు నెల రోజుల పాటు కార్మికులు పోరాటం చేశారన్నారు. కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి జీఎంతో మాట్లాడి కొత్త టెండర్ పిలిచి 213 మంది కార్మికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీఎం కూడా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని, అయితే కొత్త టెండర్ వచ్చిన అనంతరం ఇచ్చిన హామీని అమలు చేయకుండా సుమారు 70 మంది గార్డులను ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సమస్య పరిష్కారం కోసం గత రెండు నెలలుగా జీఎం కార్యాలయం, ఏరియా సెక్యూరిటీ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. 12 సంవత్సరాలుగా ఇదే ఉపాధిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులను విధుల నుంచి తొలగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే స్థానిక యువత ఉపాధి సమస్యపై సింగరేణి అధికారులతో మాట్లాడి సుమారు 70 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపాలని కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తొలగించిన 70 మంది సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలను సమీకరించి ‘చలో జీఎం కార్యాలయం’ కార్యక్రమం చేపడతామని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం నాయకులు హెచ్చరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});