మందమర్రి తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్ కళాశాలలో ఎన్నికలు
ఘనంగా ప్రమాణ స్వీకార వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పట్టణంలోని తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార వేడుకలను శనివారం పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ఉద్దేశంతో భారత ఎన్నికల విధానాన్ని పోలిన రీతిలో విద్యార్థులకు నాయకత్వ ఎన్నికలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మందమర్రి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు వారు చేపట్టిన పదవులను సూచించే బ్యాడ్జీలు, భుజమాలలను అలంకరించి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థి నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తామని ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లేందుకు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్నికల విధానంలో నాయకులను ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి, చెడులను గుర్తించి సన్మార్గంలో నడవాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవాలని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా వాటిని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని సూచించారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను చూసి కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు…….

స్కూల్ కెప్టెన్‌గా జయశంకర్ (సీఈసీ ద్వితీయ సంవత్సరం), హెడ్ బాయ్‌గా ఆడెపు చరణ్ (ఎంపీసీ ప్రథమ సంవత్సరం), హెడ్ గర్ల్‌గా సాహితీ (సీఈసీ ప్రథమ సంవత్సరం), స్పోర్ట్స్ కెప్టెన్‌గా చరణ్ (9వ తరగతి), ప్రకృతి కెప్టెన్‌గా యుక్త హాసిని (ఏసీఈ ప్రథమ సంవత్సరం) ఎన్నికయ్యారు.
వీరందరికీ సీఐ రమేష్ బ్యాడ్జీలు, భుజమాలలు అందజేసి అభినందించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి, తోటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});