CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 8:54 pm Posted By: coalbelt 24 News

విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయాలు

అధికారంలోకి వచ్చిన వెంటనే పుస్తెలు, మెట్టెల తయారీ
అమ్మకాలపై స్వర్ణకారులకే హక్కు కల్పించే ఫైల్‌పై తొలి సంతకం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. పుస్తెలు, మెట్టెలను స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలా చర్యలు తీసుకునే ఫైల్‌పై తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేస్తానని ఆమె ప్రకటించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. విశ్వకర్మ సమాజంలోని ఐదు దాయిలైన మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పి వృత్తుల్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలుగా ఆయా వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వకర్మల పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విశ్వకర్మ వృత్తుల్లో ఉన్న కష్టాలను తాను దగ్గరుండి చూశానని కవిత తెలిపారు. ఈ వర్గాల సమస్యలపై గతంలో పలుమార్లు చట్టసభల్లో ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ముఖ్యంగా కమర్షియల్‌ గోల్డ్‌ షాపులు పెరగడంతో సంప్రదాయ స్వర్ణకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు దిగజారడంతో కొందరు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విశ్వకర్మలలోని వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక సహకారం అందాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వడ్రంగులకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించడంతో పాటు శిల్పులకు దేవాలయాల కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

భూమిలేని విశ్వకర్మలకు భూమి పంపిణీ చేయాలి

విశ్వకర్మ వర్గాలకు సాధారణంగా భూములు ఉండవని కవిత అన్నారు. భూములు లేని వర్గాలకు భూమిని అందించాలనే ఉద్దేశంతోనే ‘భూలక్ష్మీ’ పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఈ పథకానికి మారోజు వీరన్న, ప్రొఫెసర్‌ జయశంకర్‌, శ్రీకాంతాచారి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని కవిత పేర్కొన్నారు. ఆయన చిత్రపటం లేకుండా తమ పార్టీ కార్యక్రమం ఏదీ జరగదని తెలిపారు. విశ్వకర్మల కష్టాలు, సమస్యలు తెలిసిన బిడ్డగా తన పార్టీకి ఆశీర్వాదం అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

40 ఏళ్లుగా జయంతి నిర్వహించడం అభినందనీయం

ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా గత 40 ఏళ్లుగా విశ్వకర్మ జయంతిని కుల పెద్దలు ఘనంగా నిర్వహిస్తూ వస్తుండటం గొప్ప విషయమని కవిత అన్నారు. సంప్రదాయ వృత్తులను కాపాడుతూ, సమాజ ఐక్యతను కొనసాగించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. విశ్వకర్మల సంక్షేమం, వారి సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});