CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:23 pm Posted By: coalbelt 24 News

మందమర్రి కే.కే-5 గనిలో ప్రమాదం

పైకప్పు కూలి కార్మికుడికి గాయాలు
ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, కార్మికులు
రక్షణ చర్యలు పాటించడం లేదంటున్న గుర్తింపు సంఘం
కార్మికుడిని పరామర్శించిన సీతారామయ్య

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి ఏరియాలోని కే.కే-5 గనిలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి షిఫ్ట్‌లో సుమారు 1.30 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలడంతో ఎస్‌డీఎల్ ఆపరేటర్ కస్తూరి శంకర్ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కార్మికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ప్రాంతంగా ఉన్న 3వ సీమ్, 14వ లెవల్‌లో నిల్వ ఉన్న బొగ్గును తొలగించేందుకు ఎస్‌డీఎల్ ఆపరేటర్ కస్తూరి శంకర్‌ను నియమించారు. ఆయన నిల్వ బొగ్గును తొలగిస్తున్న సమయంలో గోఫ్ ప్రాంతంలో ఎస్‌డీఎల్ యంత్రంపై ఒక్కసారిగా పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో గనిలో గాలి ఒత్తిడికి యంత్రంపై ఉన్న శంకర్ కాళ్లు, మెడకు గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే శంకర్‌ను మందమర్రి కే.కే-1 డిస్పెన్సరీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి గని అధికారులు తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర వైద్య సేవలు అవసరమని గుర్తించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన కార్మికుడిని పరామర్శించిన ఏఐటీయూసీ నేతలు

ప్రమాదంలో గాయపడిన కస్తూరి శంకర్‌ను ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.అనంతరం ఏఐటీయూసీ మందమర్రి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ కే.కే-5 గనిని సందర్శించి గని మేనేజర్ శంభూనాథ్ పాండేను కలిసి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థకు ఉత్పత్తి ఎంత ముఖ్యమో కార్మికుల రక్షణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉత్పత్తి లక్ష్యాల పేరుతో కార్మికుల భద్రతను విస్మరించరాదని సూచించారు.

కార్మికుల రక్షణతో కూడిన ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, భద్రతా చర్యలను పక్కనపెట్టి ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});