CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 1:52 pm Posted By: coalbelt 24 News

కార్మిక సమస్యల పరిష్కారాన్ని ఓర్వలేకే తప్పుడు ప్రచారం

టీబీజీకేఎస్‌పై ఏఐటీయూసీ నాయకుల ఆరోపణలు.
కేకే-5 గనిలో గేట్‌ మీటింగ్

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి ఏరియాలోని కేకే-5 గని ఆవరణలో మంగళవారం కార్మిక గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు కార్మికుల అపరిష్కృత సమస్యలు, యాజమాన్యంతో పాటు లేబర్‌ కమిషనర్‌తో ఇటీవల జరిగిన చర్చల వివరాలను కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ సలింద్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇటీవల యాజమాన్యం, లేబర్‌ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో కార్మికుల సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను కార్మికులకు తెలియజేస్తున్నామని చెప్పారు.

అయితే కార్మికుల సమస్యలను తమ సంఘం పరిష్కరిస్తుండటాన్ని ఓర్వలేని టీబీజీకేఎస్‌ నాయకులు కార్మికులకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మిక వర్గం సంతోషంగా ఉంటే గులాబీ సంఘం నాయకులు కళ్లుమండించుకుంటున్నారని విమర్శించారు. నిజాలను ప్రజలకు, కార్మికులకు వివరిస్తే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని అన్నారు. కార్మికుల ఓట్లతో సంఘాలను గెలిపించిన తర్వాత గతంలో ఎవరు కార్మికులకు న్యాయం చేశారో, ఎవరి పాలనలో కార్మికులకు నష్టం జరిగిందో గత పదేళ్ల అనుభవంతో కార్మికులకు స్పష్టంగా తెలిసిపోయిందని సత్యనారాయణ పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైన స్థాయిలో పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్మికుల హక్కులు, సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ గేట్‌ మీటింగ్‌లో ఏరియా ఉపాధ్యక్షులు భీమనాదుల సుదర్శన్, ఫిట్‌ కార్యదర్శి సంపత్, ఎగ్గేటి రాజేశ్వర్తో పాటు ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});