CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:49 pm Posted By: coalbelt 24 News

కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్‌ సమావేశం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్‌ సమావేశం సోమవారం నిర్వహించారు. మందమర్రి సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో జీఎం ఎన్‌. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్‌ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్‌ సెక్రటరీ దాగం మల్లేష్‌, రామకృష్ణాపూర్‌ బ్రాంచ్‌ సెక్రటరీ అక్బర్‌ అలీ తదితరులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. మందమర్రి ఏరియాలోని గనులు, వివిధ డిపార్ట్‌మెంట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 21వ మంత్లీ ఏరియా స్ట్రక్చర్‌ సమావేశం అజెండా పాయింట్లను జీఎంకు అందజేశారు.

భద్రతా సామగ్రి కొరత తీర్చాలి

మందమర్రి ఏరియా గనుల్లో సేఫ్టీ మెటీరియల్‌, డ్రిల్‌ రాడ్లు, బిట్లు, రూఫ్‌ బోల్టుల కొరతను వెంటనే తీర్చాలని యూనియన్‌ నాయకులు కోరారు. వీటి కొరత కారణంగా కార్మికుల భద్రతతో పాటు బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని తెలిపారు. కేకేఓసీ కన్వేయర్‌ బెల్ట్‌కు ఇబ్బంది కలగకుండా బెల్ట్‌కు ఇరువైపులా పేరుకుపోయిన షేల్‌ కుప్పలను తొలగించాలని కోరారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

ఏరియా స్టోర్స్‌లో ఖాళీగా ఉన్న టెండల్‌, టెండల్‌ సూపర్‌వైజర్‌, ఎస్కార్ట్‌ డ్రైవర్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, జనరల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న ఆస్బెస్టాస్‌ షీట్లను తొలగించి ఐరన్‌ రూఫింగ్‌ షీట్లను ఏర్పాటు చేయాలని, తద్వారా కంప్యూటర్లు, ముఖ్యమైన రికార్డులు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డిస్పెన్సరీలో కార్మికులకు అన్ని రకాల మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ గార్డులకు నూతన యూనిఫాం క్లాత్‌, షూస్‌, నాణ్యమైన కిట్లు అందించాలని, నిర్ణీత ప్రాంతాల్లో మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చెక్‌పోస్టుల వద్ద పాత ఫర్నిచర్‌ స్థానంలో కొత్త కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మందమర్రి ఏరియా గనులు, డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని యూనియన్‌ ప్రతినిధులు కోరారు.

సానుకూలంగా స్పందించిన జీఎం

యూనియన్‌ నాయకులు ప్రస్తావించిన సమస్యలపై జీఎం ఎన్‌. రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారు. అర్హత కలిగిన పనులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, కార్మిక సంఘాలు ఇప్పటివరకు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగించాలని కోరారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి–ఉత్పాదకత సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని జీఎం అన్నారు. సంస్థ ఉత్పత్తి లక్ష్యాలకే పరిమితం కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

సమావేశంలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్‌. ప్రసాద్‌, ఏరియా ఈఅండ్‌ఎం అధికారులు, కేకే గ్రూప్‌ ఏజెంట్‌ ఖాదిర్‌, ఎస్‌కే గ్రూప్‌ ఏజెంట్‌ సంతోష్‌కుమార్‌, కేకేఓసీపీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రాంబాబు, డీజీఎం (పర్సనల్‌) అశోక్‌, డీజీఎం (ఐఈడీ) కిరణ్‌కుమార్‌, డీజీఎం (సివిల్‌) షేక్‌ మదీనా భాష, డీజీఎం ఏరియా స్టోర్స్‌ రవీందర్‌, డీజీఎం (సర్వే) దేశాయ్‌, డీవైసీఎంఓ ఏహెచ్‌ఆర్‌కేపీ మధుకుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, వర్క్‌షాప్‌ డీవైఎస్‌సీ నరేష్‌, ఎస్‌ఎస్‌ఓ (ఎస్‌అండ్‌పీసీ) వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌సీసీహెచ్‌పీ చంద్రమౌళి, ఆర్‌ఆర్‌టీ ఇన్‌చార్జి రామ్మోహన్‌, సీనియర్‌ పీవో కార్తీక్‌, ఏఐటీయూసీ ఏరియా కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ సుదర్శన్‌, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్‌ కమిటీ సభ్యుడు రాజేశం, ఇతర అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});