కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల మండల తహశీల్దార్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రాలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపులు చేపట్టారని తెలిపారు. అయితే బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించకుండా జనరల్ కేటగిరీలో లక్కీ డ్రా నిర్వహించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేటాయించకుండా జనరల్ కేటగిరీలో చేర్చి లక్కీ డ్రా నిర్వహించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అమల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ కోటాను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులోనూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన లక్కీ డ్రాను పునఃపరిశీలించి, బీసీ రిజర్వేషన్లతో మరోసారి లక్కీ డ్రా నిర్వహించాలని అధికారులను కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొండిల్ల శ్రీనివాస్ ముదిరాజ్, నలువల సమ్మయ్య యాదవ్, మడ్డి వేణుగోపాల్ గౌడ్, యోగానందరావు, మహారాజు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});