CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 9:12 pm Posted By: coalbelt 24 News

క్రీడలతో శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం

జాతీయ క్రీడా దినోత్సవంలో అదనపు కలెక్టర్ విక్టర్

కోల్ బెల్ట్ న్యూస్(కామారెడ్డి): 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం దోమకొండ కోటలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దోమకొండ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) విక్టర్, (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్‌చంద్ దేశానికి అందించిన క్రీడా సేవలు, ఆయన సాధించిన విజయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, యువత తమలోని ప్రతిభను వెలికితీసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, యువతీ యువకులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి సత్కరించారు.

కార్యక్రమంలో దోమకొండ ట్రస్ట్ ప్రతినిధి కామినేని అనిల్, జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, దోమకొండ కోట మేనేజర్ బాబ్జీ, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});