పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యానిదే
సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షలు
సింగరేణిలో ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ కేసుల పరిష్కారం
హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అంగీకారం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఈ చర్చల అనంతరం ఆగస్టు 27న హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో పలు ప్రధాన డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపిందన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం కేకే-5, ఏరియా వర్క్‌షాప్‌లలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ మాట్లాడారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఏఐటీయూసీ కొనసాగించిన ఒత్తిడి, పోరాటం ఫలితంగానే యాజమాన్యం పలు అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.ఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, యాజమాన్యంపై కొనసాగించిన నిరంతర ఒత్తిడి కారణంగానే ఈ కీలక నిర్ణయాలు సాధ్యమయ్యాయని నాయకులు పేర్కొన్నారు.
ప్రధాన అంగీకారాలు ఇవే..
- పెర్క్స్‌పై ఆదాయపు పన్ను: కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌పై విధించే ఆదాయపు పన్నును యాజమాన్యం భరించేందుకు అంగీకరించింది.
- సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షలు: సర్వీసులో ఉండగానే సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు అందించేందుకు అంగీకారం తెలిపింది.
- ప్రతి నెల మెడికల్ బోర్డు: కార్మికుల వైద్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించనున్నారు.
- 2025–26 వాస్తవ లాభాల ప్రకటన: ప్రభుత్వ అనుమతులు తీసుకుని దసరాలోపు వాస్తవ లాభాలను ప్రకటించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.
- ట్రాన్స్‌ఫర్లలో నిబంధన సడలింపు: మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధనను తొలగించి, ఖాళీల ఆధారంగా ఒక సంవత్సరం నిబంధనతో ట్రాన్స్‌ఫర్లు చేపట్టేందుకు అంగీకారం.
- మైనింగ్ స్టాఫ్‌కు ఫోర్‌మెన్ ప్రమోషన్లు: అర్హత కలిగిన సీనియర్ మైనింగ్ స్టాఫ్‌కు సకాలంలో ఫోర్‌మెన్ పదోన్నతులు కల్పించనున్నారు.
- మారుపేర్ల సమస్యకు కమిటీ: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేసి, అందులో యూనియన్ ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించనున్నారు.
- హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి: కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై సానుకూలత.
- మెడికల్ అటెండెన్స్ నిబంధనల్లో మార్పులు: 22 ఏళ్లుగా మార్పులేని నిబంధనలను సవరించేందుకు అంగీకారం.
- దిగిపోయిన కార్మికులకు వైద్యం: సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీ సేవలతో పాటు వారం రోజుల వరకు చికిత్స అందించేందుకు చర్యలు.
- సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ: సింగరేణి పరిధిలోని విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలుపై సానుకూల స్పందన.
- భద్రతా సామగ్రి: గనుల్లో అవసరమైన భద్రతా సామగ్రిని సకాలంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు.
- మందమర్రి–క్యాతన్‌పల్లి పరిధిలో 9 శాతం హెచ్‌ఆర్‌ఏ: ఈ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 9 శాతం హెచ్‌ఆర్‌ఏ అందించే అంశంపై అంగీకారం.
- డిస్మిస్ కార్మికుల కేసులు: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డిస్మిస్ కేసులను పరిష్కరించేందుకు చర్యలు.
- మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ సర్ఫేస్ ఉద్యోగాలు: అర్హతలను పరిశీలించి జనరల్ అసిస్టెంట్లకు సర్ఫేస్‌లో తగిన ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు.
- కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్‌ఐ వైద్య సదుపాయం అందేలా చర్యలు.
- డిపెండెంట్ ఉద్యోగాల కేసులు: పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు.
- ఈవెనింగ్ కాలేజీలకు ఎన్‌ఓసీ: ఉద్యోగులు సాంకేతిక విద్యను కొనసాగించేందుకు ఈవెనింగ్ కాలేజీల్లో చేరడానికి అవసరమైన ఎన్‌ఓసీలు జారీ చేయనున్నారు.
- ఖాళీ పోస్టుల భర్తీ: క్లారికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పారామెడికల్, ఎస్‌అండ్‌పీసీ సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్, మెకానికల్ సూపర్‌వైజర్లు తదితర ఖాళీల భర్తీకి చర్యలు.
- క్యాడర్ స్కీమ్ సమస్యలు: ఈపీ ఫిట్టర్లు, క్లాంప్ ఫిట్టర్లు, సర్వేయర్లు తదితర క్యాడర్ స్కీమ్ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అంగీకారం.
- 149 మంది మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు ఆర్డర్లు: మెడికల్ ఫిట్ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేయనున్నారు.
- సొంత ఇంటి పథకం: కార్మికులకు సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం కల్పించే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
సంబరాలు నిర్వహించిన ఏఐటీయూసీ నాయకులు
కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తూ గేట్ మీటింగ్ అనంతరం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, సీహెచ్‌పీ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బ్రాంచ్, పిట్ నాయకులు పెద్దపెల్లి బానయ్య, ఎగ్గేటి రాజేశ్వరరావు, ములకలపల్లి వెంకటేశ్వర్లు, సాధనవేణ ప్రభాకర్, హేమంత్ కుమార్, విక్రమ్ సింగ్, ప్రేమ్‌లాల్‌తో పాటు పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ నాయకులు, కార్మికులు, కార్మిక సోదరీమణులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});