అహం వల్లే చాలా గొడవలు, కేసులు..
ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం
మందమర్రిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సమాజంలో ప్రతి ఒక్కరూ తోటి వారిని గౌరవించుకుంటూ, సోదరభావంతో మెలగాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. మనలోని అహంకారమే అనేక గొడవలు, కేసులకు ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే చాలా సమస్యలకు తావుండదని తెలిపారు.

శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్–కమ్–జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఎ.వీరయ్య, శారదాదేవి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి, మందమర్రి కోర్టు ఇన్‌చార్జి జడ్జి కె.నిరోష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మొక్కలు నాటారు. అనంతరం మూడు మతాల పెద్దల సమక్షంలో కోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నగేష్ భీమపాక మాట్లాడుతూ కోర్టు భవనం ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పక్కవారిని గౌరవిస్తూ స్నేహభావంతో మెలగాలని సూచించారు.
ధర్మాలు, గ్రంథాలు సైతం ప్రజల్లో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో శాంతి లేకపోవడమే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రధాన కారణమన్నారు. న్యాయస్థానాల్లో కేసుల విచారణలో వాయిదా కాలాన్ని తగ్గించి, కేసులను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. చిన్నచిన్న విషయాలను పట్టించుకోకుండా చైతన్యవంతంగా, శక్తివంతంగా, ఆనందంగా జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భూమి పొరల్లో చీకటిలో చెమటోడ్చి కష్టపడుతూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో గుర్తించదగినదని కొనియాడారు.
కేసుల పరిష్కారం వేగవంతం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో కోర్టు భవనాలు ప్రారంభించడం ద్వారా కేసుల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. జిల్లాలో అవసరమైన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. కేసుల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు
కోర్టు ప్రారంభోత్సవానికి ముందు మందమర్రి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని న్యాయమూర్తి సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయస్థానాల అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});