కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సండ్రోన్‌పల్లి రైతువేదికలో శనివారం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన “డిజిటల్ వ్యవసాయం–రైతు సేవల్లో సాంకేతికత, ఆధునిక వ్యవసాయానికి కొత్త దిశ” అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్, ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ సేవలను వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం, సమర్థవంతం, లాభదాయకంగా మార్చడమే డిజిటల్ వ్యవసాయం లక్ష్యమని వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రైతుల వివరాలు, భూమి, పంటలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేసే రైతు రిజిస్ట్రీ, డిజిటల్ పంట నమోదు, పంటల సర్వే, ఎరువుల బుకింగ్ వంటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వర్షపాతం, ఉష్ణోగ్రత, వాతావరణ హెచ్చరికల ఆధారంగా పంటల నిర్వహణ చేపట్టడం, డిజిటల్ మార్కెట్ సమాచారం ద్వారా పంటల ధరలు, మార్కెట్ డిమాండ్, విక్రయ అవకాశాలను తెలుసుకోవచ్చన్నారు.

మొబైల్ వ్యవసాయ సలహాల ద్వారా చీడపీడలు, వ్యాధులు, ఎరువుల వినియోగం, పంటల యాజమాన్యంపై నిపుణుల సూచనలు పొందవచ్చని తెలిపారు. డిజిటల్ వ్యవసాయ సేవలతో రైతులకు సమయానికి సమాచారం అందడంతో పాటు సరైన పంట యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడంతో పాటు వాతావరణ ఆధారిత పంట నిర్వహణ, మెరుగైన మార్కెటింగ్ నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవసాయ సేవలను కూడా రైతులు సులభంగా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. రాజశేఖర్, ఎస్. కనకరాజు, సర్పంచులు, కృషి సఖిలు, రైతులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});