రవితేజపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి
టీయూడబ్ల్యూజే హెచ్–143 కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఆర్‌బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజపై జరిగిన భౌతిక దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్–143) కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
భూ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ బాధితులు చేపట్టిన ధర్నా, నిరసన దీక్ష కార్యక్రమాన్ని రవితేజ తన వృత్తి ధర్మంలో భాగంగా కవర్ చేసి, బాధితుల ఆవేదనను వార్త రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లారని శ్రీనివాస్ తెలిపారు. అయితే ఆ వార్తను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో రవితేజ ఇంటికి వెళ్లి భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం అత్యంత దారుణమన్నారు.
“జర్నలిస్టు ఇంటిపై దాడి అంటే కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రశ్నించే గొంతుపై దాడి” అని రేనుకుంట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వాస్తవాల ఆధారంగా కవర్ చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జర్నలిస్టుల వృత్తి ధర్మమని అన్నారు. సమస్య న్యాయబద్ధమైనదా కాదా అనే విషయాన్ని సంబంధిత అధికారులు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని, వార్తను కవర్ చేసినందుకు జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
గ్రామీణ జర్నలిస్టులకు భద్రత కల్పించాలి
మండల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా కేంద్రాలు, పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులతో సమానంగా వృత్తి స్వేచ్ఛ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శ్రీనివాస్ అన్నారు. గ్రామాల్లో రైతుల సమస్యలు, భూ వివాదాలు, పేదల ఇబ్బందులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అన్యాయాలను ముందుగా ప్రజల దృష్టికి తీసుకువచ్చేది స్థానిక విలేకరులేనని తెలిపారు.
సామాజిక కోణంలోనూ విచారణ జరపాలి
రవితేజ దళిత జర్నలిస్టు కావడంతో ఈ ఘటనలో సామాజిక కోణాన్ని కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని నిబంధనలు వర్తించే పరిస్థితులు ఉన్నట్లయితే, చట్టప్రకారం సంబంధిత సెక్షన్లను నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, దాడికి పాల్పడిన వారు ఎవరైనా, వారికి ఎంతటి రాజకీయ లేదా అధికార పలుకుబడి ఉన్నా చట్టం ముందు నిలబెట్టాలని రేనుకుంట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రవితేజకు న్యాయం జరిగే వరకు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు బాధితుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, వివక్ష వంటి చర్యలను టీయూడబ్ల్యూజే హెచ్–143 ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని, జర్నలిస్టులకు సంఘం అన్ని విధాలా అండగా ఉంటుందని రేనుకుంట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});