కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం అదిల్‌పేట్ రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేలసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. సహజసిద్ధమైన పద్ధతుల్లో సాగు చేయడం వల్ల నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయడంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రైతులు తమ భూమి స్వభావం, నేలసారం, నీటి వసతులను పరిగణనలోకి తీసుకుని అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధికంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు భూమిలో సహజసిద్ధమైన సారం క్రమంగా తగ్గిపోతుందని వివరించారు.
ప్రభుత్వం రైతుల కోసం వ్యవసాయ రంగంలో అనేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై రైతు వేదికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృషి సఖీలు, లిఖిత, రైతులు తదితరులు పాల్గొన్నారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});