CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 10:21 pm Posted By: coalbelt 24 News

సమస్యలతో సతమతమవుతున్న కాసిపేట 1ఏ గని కార్మికులు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): 

కాసిపేట 1ఏ గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు బుధవారం పరిశీలించారు. సీఐటీయూ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు ఎస్. వెంకటస్వామి కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గని నూతనంగా ఏర్పడినందున అవసరమైన మౌలిక సదుపాయాల పనులను యాజమాన్యం వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్ఫేస్‌కు వచ్చిన జనరల్ అసిస్టెంట్ల బేసిక్ తగ్గుదలపై కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను కార్మికులకు వివరించారు.

గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా కార్మికుల వేతనాల నుంచి ప్రతి నెలా రికవరీ చేస్తున్న సీఎం పీఎఫ్ మొత్తాలను జమ చేయకపోవడం సరికాదని అన్నారు. వెంటనే వివరాలను అప్‌డేట్ చేసి వడ్డీ కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం పీఎఫ్ వివరాల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని విమర్శించారు.

మెటీరియల్ కొరతతో కార్మికులపై భారం

గనుల్లో బూట్లు, బిట్లు, క్యాప్సూల్స్ తదితర పనిముట్లు, ఇతర మెటీరియల్ కొరత తీవ్రంగా ఉందని నాయకులు తెలిపారు. దీనివల్ల కార్మికులు అధిక శ్రమకు గురవుతున్నారని, పనులకు ఆటంకం ఏర్పడి నాగాలు పెరిగి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అవసరమైన మెటీరియల్‌ను కొనుగోలు చేసి కొరత లేకుండా చూడాలని యాజమాన్యాన్ని కోరారు.

గత ఆర్థిక సంవత్సర లాభాలను కూడా కార్మికులకు ఇప్పటివరకు వెల్లడించకపోవడం సరికాదని, సంస్థ అభివృద్ధికి కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కొత్త నిబంధనల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్నా గుర్తింపు సంఘం స్పందించకపోవడం విచారకరమన్నారు.కార్మిక సమస్యల పరిశీలన కార్యక్రమం కాజీపేట-1ఏ గని కార్యదర్శి నాగవల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డబ్బేటి శ్రీనివాస్‌తో పాటు పలువురు గని కార్మికులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});