CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 9:17 pm Posted By: coalbelt 24 News

ఆలస్యంగా వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం

చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భాను ప్రసాద్

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, వర్షాలు ఆలస్యంగా లేదా అసమానంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆలస్యంగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భానోత్ ప్రసాద్ సూచించారు.

మంగళవారం మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి లభ్యతను ముందుగా అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆలస్యంగా వరి నాటితే పూత, గింజ ఏర్పడటం, గింజలో పాలు పోసుకునే దశల్లో నీటి కొరత ఏర్పడి దిగుబడి, నాణ్యత తగ్గే అవకాశం ఉందన్నారు.

చెరువులు, కుంటలు, బోర్లలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా కంది, జొన్న, నువ్వులు తదితర ఆరుతడి పంటలను నేల రకం, వర్షపాతం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల ద్వారా నీటి వనరులపై ఒత్తిడి తగ్గడంతో పాటు నేల సారం, పంటల వైవిధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. రాజశేఖర్, సర్పంచ్ పెంచాల మధు, రైతులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});