CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:18 pm Posted By: coalbelt 24 News

సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించకుంటే సమ్మె తప్పదు

ఈ నెల 21న ఆర్‌ఎల్‌సీ తో చర్చలు
చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 21వ తేదీ తర్వాత అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె తేదీని ప్రకటిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం మందమర్రి కేకేఓసీ ప్రాజెక్టు గేట్ వద్ద నిర్వహించిన ఏఐటీయూసీ గేట్ మీటింగ్‌లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదన్నారు. ఈ నెల 21న ఆర్‌ఎల్‌సీ వద్ద జరిగే చర్చలు విఫలమైతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి

పెర్క్స్‌పై ఆదాయపన్ను, సొంతింటి కల సొసైటీ, మారుపేర్ల సవరణ, సంస్థ లాభాలను ప్రకటించి అందులో 40 శాతం కార్మికులకు వాటాగా ఇవ్వడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీతారామయ్య కోరారు. సింగరేణికి ప్రభుత్వాల నుంచి రావాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మెడికల్ బోర్డు నిర్వహించి ఇన్‌వాలిడేషన్ ఇవ్వాలనే డిమాండ్‌ను సమ్మె నోటీసులో చేర్చడంతో యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించేందుకు అంగీకరించిందన్నారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి కూడా యాజమాన్యం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

హెచ్‌ఆర్‌ఏ సమస్యకు పరిష్కారం

మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, ఆర్కేపీ సీహెచ్‌పీ కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ, ఇంటి అద్దె చెల్లింపుల విషయంలో యాజమాన్యం ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని సీతారామయ్య విమర్శించారు. కార్పొరేట్ స్థాయిలో యాజమాన్యంతో పలుమార్లు చర్చించిన అనంతరం మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలోని రెండు విభాగాల కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ వర్తించేలా సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఇది కార్మికుల విజయమని పేర్కొన్నారు.

కొత్త గనులతోనే సింగరేణికి పూర్వవైభవం

గత 15 ఏళ్లలో సింగరేణిలో కొత్తగా ఒక్క గని కూడా రాకపోవడంతో కార్మికులు, వారిపై ఆధారపడిన వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా తాడిచర్ల-2, మణుగూరు డీప్‌సైడ్ ఓపెన్‌కాస్ట్ గనులను సింగరేణికి కేటాయించడం కొంత ఊరటనిచ్చిందన్నారు.

గోలేటి ఓపెన్‌కాస్ట్, శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్, కేకే-6 గని, సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ తదితర గనులు కూడా సింగరేణికి వచ్చేలా చర్యలు తీసుకుంటే సంస్థకు పూర్వవైభవం వస్తుందని, కార్మికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ డిమాండ్లను కూడా సమ్మె నోటీసులో పొందుపరిచినట్లు వెల్లడించారు.

12వ వేజ్‌బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి

12వ వేజ్‌బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సీతారామయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. వేజ్‌బోర్డుకు నాలుగు లేబర్ కోడ్‌లను జోడించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వేజ్‌బోర్డు చర్చల్లో పాల్గొనే అర్హతకు 51 శాతం కార్మికుల ఓటింగ్ నిబంధన విధించడాన్ని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా 51 శాతం ఓటింగ్ ఉంటుందా అని నిలదీశారు.

తక్షణమే 12వ వేజ్‌బోర్డును ఏర్పాటు చేసి ధరలకు అనుగుణంగా కార్మికులకు మెరుగైన జీతభత్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఇటీవల కోల్ ఇండియా, సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు సమర్పించినట్లు తెలిపారు.

భద్రతా పరికరాలపై నిర్లక్ష్యం తగదు

ఏరియా స్థాయి సమస్యలను ప్రస్తావించిన నాయకులు నాణ్యమైన సేఫ్టీ పరికరాలను కొనుగోలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సింగరేణి, కార్మికులకు జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమానికి బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచి కార్యదర్శులు శైలేంద్ర, సత్యనారాయణ, దాగం మల్లేష్, ఏరియా నాయకులు గోపతి సత్యనారాయణ, ఎగ్గేటి రాజేశ్వరరావు, పెద్దపల్లి బాలయ్య, టేకుమట్ల తిరుపతి, రాజేష్ కుమార్ యాదవ్, కేకేఓసీ పిట్ కార్యదర్శి మర్రి కుమారస్వామి, పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు ముద్దసాని కోటయ్య, పల్లె మల్లేష్, తోట శ్రీనివాస్, సారయ్య, తిరుపతి, మహిళా విభాగం నాయకురాలు వైజయంతి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జెట్టి మల్లయ్యతో పాటు పలువురు కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});