CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:35 pm Posted By: coalbelt 24 News

సింగరేణి ఇనుప సామగ్రి తరలిస్తున్న వ్యాన్‌ స్వాధీనం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణికి చెందిన ఇనుప సామగ్రిని అక్రమంగా తరలిస్తున్న ఐచర్‌ వ్యాన్‌ను మందమర్రి ఎస్‌అండ్‌పీసీ (సెక్యూరిటీ) సిబ్బంది మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ కె. వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లికి చెందిన స్క్రాప్‌ వ్యాపారి ఎస్‌.కె. సలీమ్‌ ఏపీ 15 టీబీ 4555 నంబర్‌ గల ఐచర్‌ వ్యాన్‌లో సింగరేణికి చెందిన ఇనుప సామగ్రిని తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన కె. శ్రీనివాస్‌రావుకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. ఈ సమాచారాన్ని ఆయన ఏరియా సెక్యూరిటీ అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది వ్యాన్‌ను వెంబడించి మందమర్రి జీఎం కార్యాలయం సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు.
జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ బోయిన ఓదేలు, ఎస్‌.కె. దాస్‌, జమేదార్‌ జి. రాజయ్య తదితర సెక్యూరిటీ సిబ్బంది వ్యాన్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం వ్యాన్‌ను ఎస్‌అండ్‌పీసీ కార్యాలయానికి తరలించి, దానిపై ఉన్న పరదాను తొలగించి తనిఖీ చేయగా సింగరేణికి చెందిన రోలర్లు, స్టాండ్లు, ఇతర ఇనుప సామగ్రి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
సింగరేణి ఆస్తులను అక్రమంగా తరలించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, సంస్థ ఆస్తుల పరిరక్షణకు భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని సెక్యూరిటీ ఆఫీసర్‌ కె. వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇనుప సామగ్రితో పాటు ఐచర్‌ వ్యాన్‌ను తదుపరి చర్యల నిమిత్తం మందమర్రి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});