CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 9:55 pm Posted By: coalbelt 24 News

12వ వేజ్‌ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి

సెప్టెంబర్‌ 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
జాతీయ కార్మిక సంఘాల జాక్‌ హెచ్చరిక
మందమర్రిలో కార్మిక సంఘాల ధర్నా

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

12వ వేజ్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని జాతీయ కార్మిక సంఘాల ఐక్య పోరాట జాక్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో సెప్టెంబర్‌ 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం దేశవ్యాప్త జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అక్బర్‌ అలీ, మందమర్రి ఏరియా బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సలేంద్ర సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంపెల్లి సమ్మయ్య, ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ భూమయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్‌, మందమర్రి బ్రాంచ్‌ అధ్యక్షుడు వెంకటస్వామి, హెచ్‌ఎంఎస్‌ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పార్వతి రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు.

వేజ్‌ బోర్డు ఏర్పాటులో ఎందుకు జాప్యం?

11వ వేజ్‌ బోర్డు కాలపరిమితి ముగిసినప్పటికీ 12వ వేజ్‌ బోర్డు కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. 12వ వేజ్‌ బోర్డు కాలపరిమితి జూలై 1 నుంచే ప్రారంభం కావాల్సి ఉందని, అందులో భాగంగా హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ ఎదుట ఇప్పటికే ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వేజ్‌ బోర్డు ఏర్పాటుపై యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన సబ్సిడీలు, అలవెన్సులను తగ్గించి నామమాత్రపు ప్రయోజనాలు కల్పించేందుకు కోల్‌ ఇండియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి

కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువచ్చిందని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఈ చట్టాలను ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా తగ్గిస్తూ ప్రైవేటీకరణకు దారితీస్తున్నారని విమర్శించారు. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణలో అన్వేషణ పూర్తయిన సుమారు 14–15 బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ కార్మిక సంఘాల ఆందోళనల ఫలితంగానే మణుగూరు ఓసీ కేటాయింపు జరిగిందని తెలిపారు.

సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలి

తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. గనులు ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వల్ల భవిష్యత్తులో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది శాశ్వత కార్మికులు, మరో రెండు లక్షల మంది ప్రైవేటు కార్మికులు బొగ్గు పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. కార్మికుల శ్రమతో ప్రభుత్వాలకు డివిడెండ్లు, సంస్థలకు లాభాలు వస్తున్నప్పటికీ కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.

కార్మికుల కోసమా …సంఘాల ఉనికి కోసమా ?….

ధర్నా సందర్బంగా కార్మిక సంఘాల పరిస్థితిని ధర్నాలో గమనిస్తే కార్మికుల హక్కుల కోసం వ్యవహరించినట్టుగా లేదని, వారి ఉనికి కోసం పాకులాడినట్టుగా ఉందనే అభిప్రాయాలు కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సంఘటన వివరాలలోకి వెళితే ….ధర్నా సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరస్పరం ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.అయితే జాతీయ సంఘాల ఐక్య పోరాటంలో భాగంగా 12వ వేజ్‌ బోర్డు అంశంపై మాత్రమే మాట్లాడాలని ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంపెల్లి సమ్మయ్య సూచించారు. దీంతో ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ కార్యకర్తల మధ్య కొంతసేపు నినాదాలతో గందరగోళం ఏర్పడింది.ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్‌ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ జోక్యం చేసుకుని 12వ వేజ్‌ బోర్డు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మాత్రమే మాట్లాడాలని, ఐక్య పోరాటానికి విఘాతం కలిగించే విమర్శలు చేయడం సరికాదని సూచించారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.

తర్వాత జాతీయ కార్మిక సంఘాల నాయకులు మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. రాధాకృష్ణను కలిసి తమ డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. 12వ వేజ్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరింత సమరశీల పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});