CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:24 pm Posted By: coalbelt 24 News

ఎల్పీజీ గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను రక్షించుకోవచ్చని ఇండియన్ గ్యాస్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు తెలిపారు. శుక్రవారం మందమర్రి ఇండియన్ గ్యాస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిత్యం చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీ ప్రమాదాలను నివారించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారులు కొన్ని ప్రాథమిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సిలిండర్‌ను స్వీకరించే సమయంలో దాని గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. సిలిండర్‌పై ఉన్న మెటల్ పట్టీలపై A, B, C, D కోడ్‌లతో పాటు సంవత్సరం సూచించే సంఖ్యలు ఉంటాయని, ఉదాహరణకు A-26 అంటే 2026 సంవత్సరం తొలి త్రైమాసికం వరకు మాత్రమే వినియోగానికి అనుమతించబడిన సిలిండర్ అని వివరించారు. గడువు ముగిసిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని సూచించారు.

డెలివరీ సమయంలో సిలిండర్ సీల్ సక్రమంగా ఉందో లేదో డెలివరీ సిబ్బంది సమక్షంలోనే పరిశీలించాలని, వాల్వ్ వద్ద సబ్బునీరు లేదా నీటితో లీకేజీ పరీక్ష నిర్వహించి గ్యాస్ లీకేజీ లేదని నిర్ధారించుకోవాలని తెలిపారు.అదేవిధంగా సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిటారుగా మాత్రమే ఉంచాలని, పడుకోబెట్టరాదని పేర్కొన్నారు. గ్యాస్ స్టవ్‌ను సిలిండర్ కంటే ఎత్తైన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్, సేల్స్ మేనేజర్ కేడీవీ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్, గోదాం ఇన్‌చార్జి బడికేల రాజు, డెలివరీ సిబ్బంది, గృహిణులు, గ్యాస్ వినియోగదారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});