CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:46 pm Posted By: coalbelt 24 News

జనసేనతో పొత్తులు లేవు

ఒంటరి పోరుకే సిద్ధం
సొంతంగా ఎదగడమే లక్ష్యం
బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్‌రావు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాబోయే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేనతో సహా ఏ ఇతర రాజకీయ పార్టీతోనూ బీజేపీకి పొత్తులు ఉండబోవని, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమైన అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సొంత బలం, కేడర్, ఓటు బ్యాంక్‌ను మరింత పటిష్ఠం చేసుకుని ప్రధాన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే పార్టీ లక్ష్యమని ఈ ప్రకటనతో స్పష్టమైంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టేందుకు అధిష్ఠానం ఒంటరి పోరాట వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి విజయాన్ని నమోదు చేశాయి. దీంతో తెలంగాణలో కూడా అదే తరహా పొత్తు కొనసాగుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. ముఖ్యంగా జనసేనతో బీజేపీ మైత్రి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు భిన్నంగా ఉన్నందున ఏపీ ఫార్ములాను తెలంగాణలో అమలు చేయడం సాధ్యం కాదని బీజేపీ అధిష్ఠానం భావించినట్లు సమాచారం. పొత్తుల కంటే పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పొత్తులు కుదుర్చుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేసినట్లు సమాచారం. అందుకే ప్రతి నియోజకవర్గంలో సొంత శక్తితో పోటీ చేస్తూ పార్టీని మరింత విస్తరించాలనే వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.రామచందర్‌రావు చేసిన ఈ ప్రకటనతో తెలంగాణలో పొత్తులపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జనసేనతో పొత్తు ఉంటుందని భావించిన నేతలకు ఇది స్పష్టమైన సంకేతంగా మారింది. మరోవైపు జనసేన కూడా రాష్ట్రంలో స్వతంత్రంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బహుముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});